: ఇది ఆరంభం మాత్రమే: తన 100 రోజుల పాలనపై డొనాల్డ్ ట్రంప్ స్పందన
సర్వే సంస్థల అంచనాలకు కూడా ఏ మాత్రం దక్కకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 100 రోజులు అవుతోంది. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న ట్రంప్ పాలనపై పలువురి నుంచి ఎన్నో విమర్శలు వస్తున్నా ఎవరిమాటా వినకుండా ట్రంప్ తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో తన 100 రోజుల పాలనపై డొనాల్డ్ స్పందించారు. ఈ 100 రోజులు అమెరికా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన రోజులని ఆయన అన్నారు. కేవలం 14 వారాల్లోనే తన యంత్రాంగం గొప్ప మార్పును తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
ఈ 100 రోజుల్లో తాము ప్రధానంగా ఉద్యోగాలను వెనక్కి తెచ్చామని ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే మిచిగాన్, ఒహియో, పెన్సిల్వేనియా ప్రజలను అడగాలని, అక్కడ ఏం జరుగుతుందో చెబుతారని పేర్కొన్నారు. కార్ల కంపెనీలు తిరిగి వెనక్కి వచ్చాయని ఉద్ఘాటించారు. తమ దేశం ఎంతో వేగంగా ముందుకెళ్తొందని ట్రంప్ అన్నారు. తమ దేశ కంపెనీలు ఎంతో బాగా పనిచేస్తున్నాయని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని తెలిపారు. తమ సర్కారు అధికారాన్ని తిరిగి అమెరికా ప్రజలకు అందజేసిందని, ఇతర రాజకీయ నేతలు తమ దేశ డబ్బు, ఉద్యోగాలు ఇతర దేశాలకు తరలించారని ఆయన ఆరోపణలు గుప్పించారు.