: ఎర్రబెల్లి ఇంత ఉషారోడని నేను అనుకోలే.. నవ్వులు పూయించిన కేసీఆర్!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాఘవాపురం సభలో నవ్వులు పూయించారు. పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన రాఘవాపురంలో జరిగిన సభలో నవ్వులు పూయించి గ్రామస్తుల్లో జోష్ నింపారు. సభ ప్రారంభం నుంచి ముగిసే వరకు చలోక్తులు విసురుతూ ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావును అభినందించారు.
‘‘ఎర్రబెల్లి ఉషారోడని నాకు ఎరికే గానీ, మరింత గింత ఉషారున్నోడని అనుకోలే’’ అంటూ సభలో నవ్వులు పూయించారు. అభివృద్ధిలో రాఘవాపురం.. గంగదేవిపల్లిని మించిపోతుందని చెప్పాడని, నిజానికి అందుకు చాలా సమయం పడుతుందని కేసీఆర్ అన్నారు. పంచాయితీలు పెట్టుకోకుండా అందరూ కలిసి మెలసి పనిచేయాలని సూచించారు. తాను పాలకుర్తికి వచ్చేవరకు ఎర్రబెల్లి వెంటపడి మరీ తీసుకొచ్చడని పేర్కొన్న కేసీఆర్, ఇక్కడికి రాగానే పెద్ద చిట్టా చేతికిచ్చి డబ్బులు ఇస్తావా? లేదా? అన్నట్టు నిలబడ్డాడని అనడంతో ప్రజలు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు.
పాలకుర్తి నుంచి నాంచారి మడూరు వరకు రోడ్డు కావాలని మంత్రి తుమ్మలను అప్పుడే ఎర్రబెల్లి అడిగారని, ఒకవేళ ఆ మంత్రి కనుక ఇక్కడ ఉండి ఉంటే రోడ్డు ఇచ్చేదాక కట్టేసేవాడేమోనని అనడంతో అందరూ పెద్దపెట్టున నవ్వేశారు. రోడ్డు విషయంలో రేపే హైదరాబాద్ వచ్చి ఉత్తర్వులు తీసుకోవాలని కేసీఆర్ ఎర్రబెల్లికి సూచించారు.