: కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ వద్ద బాహుబలి రాజమౌళి టీమ్... కేరింతలు కొట్టిన అభిమానులు
‘బాహుబలి-2:ద కన్ క్లూజన్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్లన్నింటినీ ఆక్రమించేసింది. తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 90 శాతం సినిమా ధియేటర్లలో ఈ సినిమాయే ప్రదర్శితమవుతోంది. అయినప్పటికీ తొలి రోజు తొలి షో చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఎంతో ఆసక్తిగా ఉన్న అభిమానుల మధ్య సినిమా చూసేందుకు ‘బాహుబలి-2:ద కన్ క్లూజన్’ దర్శకుడు రాజమౌళితో పాటు యూనిట్ సభ్యులు కొందరు హైదరాబాదులోని కూకట్ పల్లి, శ్రీ భ్రమరాంబ థియేటర్ కు వెళ్లారు.
టికెట్ల కోసం బారులు తీరిన అభిమానులు, సినిమా యూనిట్ సభ్యులను చూసి కేరింతలు కొట్టారు. లైన్ నుంచి పక్కకి వెళ్తే టికెట్ దొరకదు.. మరోపక్క ఈ సినిమా రూపకర్త కళ్ల ముందునుంచి వెళ్లిపోతున్నాడు.. దీంతో కొందరు అభిమానులు రాజమౌళి వద్దకు పరుగుపరుగున వెళ్లి చేయికలిపారు. రాజమౌళితోపాటు ఆయన భార్య రమ, హీరోయిన్ అనుష్క, కీరవాణి దంపతులు, సినిమాటోగ్రఫర్, పీవీఆర్ సంస్థల యజమాని ప్రసాద్, ఇతర చిత్ర బృంద సభ్యులు ఉన్నారు.