: తమిళ ప్రజలను పట్టించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు... ధ్వజమెత్తిన నగ్మా
మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, సినీ నటి నగ్మా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోశారు. గురువారం చెన్నైలోని సత్యమూర్తి భవన్లో జరిగిన తమిళనాడు మహిళా కాంగ్రెస్ నిర్వాహకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమిళనాడు ప్రజల గోడు పట్టించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవని విమర్శించారు. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం గౌరవించి రాష్ట్రంలో అడ్డదారిలో మద్యం దుకాణాలు తెరవకుండా ఉండాలని అన్నారు. తమిళ రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఢిల్లీలో ఆందోళన చేపడితే వారి గోడును పట్టించుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు.
రైతుల డిమాండ్లు నెరవేర్చేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందుకు రావాలన్నారు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్కు లంచం ఇవ్వజూపిన కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందేనని నగ్మా అన్నారు. రాష్ట్రంలో ఒకశాతం మద్దతు కూడా లేని బీజేపీ ఇక్కడ కాలు మోపేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అన్నాడీఎంకే చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహిళలను కించపరిచిన కేరళ మంత్రిని పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా నగ్మా డిమాండ్ చేశారు.