: అనంతపురానికి హ్యుందయ్ కార్ల తయారీ కేంద్రం.. ముందుకొచ్చిన ఆటోమొబైల్ దిగ్గజం.. నేడు ఎంవోయూ!
నవ్యాంధ్రకు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషితో రాష్ట్రానికి అంతర్జాతీయ దిగ్గజాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా’ మోటార్స్ అనంతపురం జిల్లాలో కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఏటా 3 లక్షల హ్యుందయ్ కార్ల ఉత్పత్తి లక్ష్యంగా రూ.12,910 కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు గురువారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకోనుంది.
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచిలో 599 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్‌లో 11 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది. వెనకబడిన అనంతపురం జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కియా ముందుకు రావడంతో ఆ సంస్థకు అల్ట్రా మెగా ఇండస్ట్రీకి ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరో విశేషం ఏంటంటే.. ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన కియా మరో రెండేళ్లలోనే అంటే 2019 నాటికే ప్రయోగాత్మకంగా కార్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. అలాగే అక్టోబరు 2019 నాటికి పూర్తిస్థాయిలో కార్లను ఉత్పత్తి చేయాలని ఏపీ సర్కారు కూడా షరతు విధించింది. 1944లో ఏర్పాటైన కియా మోటార్స్ కంపెనీకి దక్షిణ కొరియాలోని సియోల్‌కు చెందిన సంస్థ. వాహన తయారీ రంగంలో దీనికి ప్రపంచంలోనే ఐదో స్థానం.