: రూ. 150 టికెట్ ను కౌంటర్లలోనే రూ. 250కి అంటగడుతున్న ప్రసాద్ ఐమాక్స్ సిబ్బంది... ఫ్యాన్స్ నిరసన
ఈ ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద బాహుబలి రెండో భాగానికి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా, తెల్లవారుజాము నుంచి వేచి చూసిన అభిమానులు నిరసనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బిగ్ స్క్రీన్ పై రూ. 250, నార్మల్ స్క్రీన్స్ పై రూ. 150 టికెట్ రేటుగా ఉండగా, నార్మల్ స్క్రీన్ పై రూ. 250కి టికెట్లను సిబ్బంది విక్రయిస్తుండటంతో, పలువురు అభిమానులు గొడవకు దిగారు. రూ. 150 సినిమా టికెట్ ను కాంబో పేరుతో మరో వంద రూపాయలు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు. తాము గంటలకొద్దీ వేచి చూసి, కౌంటర్ వద్దకు వెళితే, సినిమా టికెట్ తో పాటు కూల్ డ్రింక్, పాప్ కార్న్ కొనడం తప్పనిసరిని, అలాగైతేనే టికెట్ ఇస్తామని చెబుతూ దోచుకుంటున్నారని అభిమానులు ఆరోపించారు. నిరసన తెలుపుతున్న అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులను రంగంలోకి దించారని తెలిపారు. పలువురు టికెట్లు కొనకుండానే వెనక్కు తిరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఐమాక్స్ లో ఉన్న అన్ని స్క్రీన్స్ లో తొలి మూడు రోజుల పాటూ బాహుబలినే ప్రదర్శిస్తుండగా, అన్ని టికెట్లూ దాదాపు అయిపోవడం గమనార్హం.