: బాబోయ్‌ మరో వైరస్‌


కొంతకాలం కిందట సార్స్‌ వైరస్‌ చైనా దేశాన్ని వణికించింది. ఇది ఇతర దేశాలను కూడా భయాందోళనలకు గురిచేసింది. అయితే తాజాగా ఇదే తరహాకు చెందిన మరో కొత్త వైరస్‌ మానవ మనుగడకు ప్రమాదకారిగా తయారయ్యింది. సౌదీ అరేబియాలో కొత్తగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ బారినపడి ఇప్పటికే ఐదుగురు వ్యక్తులు మరణించగా మరో ముగ్గురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జంతువుల నుండి మానవులకు సోకే నోవెల్‌ కరోనా వైరస్‌ లేదా హెచ్‌సీవోబీ`ఇఎంసీగా పేర్కొనే ఈ వైరస్‌ను గత ఏడాది జూన్‌లో గుర్తించారు. జంతువుల నుండి మనుషులకు సోకే ఈ వైరస్‌ పదేళ్ల కిందట ఆసియాలో భయాందోళనలను సృష్టించింది. సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌) తరహా వైరస్‌గా భావిస్తున్న ఈ వైరస్‌ సోకితే అత్యంత వేగంగా మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. దీనికి కారణాలు తెలియడంలేదు.

సార్స్‌ వల్ల జలుబు, ఊపిరితిత్తులు వాచిపోయే న్యూమోనియా వంటి వ్యాధుల తరహా ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిఫలితంగా గతంలో దాదాపు 800 మంది దాకా మరణించారు. కాగా ఈ సార్స్‌ తరహా కొత్త వైరస్‌ ఒకరి నుండి మరొకరికి ఎలా వ్యాపిస్తుందో కూడా అంతుపట్టడం లేదని శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ వ్యాధికి సంబంధించి సౌదీ అరేబియా, జోర్డాన్‌, జర్మనీ, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఇప్పటికే 23 కేసులు నమోదుకాగా, 16మంది మరణించారు. ఒక్క రియాద్‌లోనే 11 మందిదాకా మరణించారు. అయితే ముందు జాగ్రత్తగా ఈ వ్యాధి సోకిన వారి సన్నిహితుల రక్త నమూనాలను కూడా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News