: దినకరన్ అరెస్టు కాగానే శశికళ బ్యానర్లు తొలగించేసిన పళనిస్వామి వర్గం
అన్నాడీఎంకే బహిష్కృత ప్రధాన కార్యదర్శి శశికళ బ్యానెర్లను పార్టీ కార్యాలయం నుంచి తీసేశారు. తమిళనాట జయలలిత మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలు తుది దశకు చేరుకున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ నియమించిన డిప్యూటీ కార్యదర్శి టీటీవీ దినకరన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అనంతరం తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో శశికళ ఫ్లెక్సీలను తొలగించారు.
పార్టీని అన్నాడీఎంకేలో మళ్లీ విలీనం చేయాలంటే... ముందు శశికళ ఫోటోలు తొలగించి, పార్టీ కార్యాలయాన్ని పవిత్రంగా ఉంచాలని పన్నీరు సెల్వం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో దినకరన్ అలా అరెస్టు కాగానే... పళనిస్వామి వర్గం ఇలా శశికళ ఫోటోలు తీసేయించింది. దీనిపై పన్నీరు సెల్వం మీడియా ప్రతినిధి స్వామినాధన్ మాట్లాడుతూ, శశికళ ఫోటోలు, ఫ్లెక్సీలు తొలగించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో నేడు పన్నీరు వర్గం విలీనం ప్రకటన చేస్తుందని అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి.