: కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో షవర్ కింద నిలబడ్డాను: గంభీర్ చెప్పిన కోపం కథ
ఐపీఎల్ సీజన్ 10లో కోల్ కతా నైట్ రైడర్స్ ప్రదర్శన బాగున్నప్పటికీ విజయాలు మాత్రం అందడం లేదు. ప్రదర్శన గొప్పగా ఉన్నా విజయాలు దక్కకపోవడంతో జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ లో అసహనం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో గుజరాత్ లయన్స్ జట్టుపై ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఒక దశలో 65 పరుగులకే ఒక వికెట్ కోల్పోయి పటిష్ఠంగా కనిపించిన తమ జట్టు కేవలం 131 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తనలో కోపం కట్టలు తెంచుకుందని అన్నాడు. ఆ ఆవేశంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోనని ఆలోచించి....నేరుగా బాత్రూంలోకి వెళ్లానని అన్నాడు.
షవర్ కింద మూడు లేక నాలుగు నిమిషాలు అలాగే నిలబడ్డానని తెలిపాడు. బయట సుమారు అరవై వేల మందికిపైగా ప్రేక్షకులతో స్టేడియం మార్మోగుతోంది. మా డ్రెస్సింగ్ రూమ్ లో మాత్రం నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఎంత అణచుకున్నా ఆగని కోపంతో షవర్ నుంచి బయటకు వచ్చి...సహచరులతో కోల్ కతా నైట్ రైడర్స్ కోసం ఇదే చివరి మ్యాచ్ అనుకోమన్నాను. కనీసం తన కెప్టెన్సీలో పోరాడమని కోరానని, మ్యాచ్ ను గెలవమని అడిగాన’ని గౌతమ్ గంభీర్ తెలిపాడు. ప్రతి మ్యాచ్ బ్రేక్ లో ఏదో ఒకటి తింటాను కానీ ఆ రోజు ఏమీ తినకుండా కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు షవర్ కింద నిలబడ్డానని గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో బెంగళూరు జట్టును కేవలం 49 పరుగులకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే.