: మే 13వ తేదీన మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం?
రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జరిగిన విధ్వంసం ఇంకా అందరి కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఈ ప్రపంచానికి సెకండ్ వరల్డ్ వార్ మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఇంకా ఈ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడకుండానే... మూడో ప్రపంచ యుద్ధం భయాలు పెరిగిపోయాయి. సిరియా, కొరియా, క్రిమియా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు... రష్యా, చైనా, అమెరికాల మధ్య ఘర్షణ వాతావరణం... భారత్, పాక్, చైనాల మధ్య నిరంతర యుద్ధ భయం... ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది.
యూరప్ లో సైనిక చర్యలు పెరుగుతున్నాయి. పశ్చిమాసియా దేశాలు నిరంతరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ నౌకల సందడి పెరిగింది. దక్షిణాసియా దేశాల సరిహద్దులు నిత్యం ఉద్రిక్తంగానే ఉంటున్నాయి. వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ, అమెరికాపైనే కయ్యానికి కాలు దువ్వుతోంది ఉత్తరకొరియా. ఈ నేపథ్యంలో, మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందన్న భయాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. యుద్ధాన్ని ఏదో ఒక దేశం ప్రారంభిచడమే తరువాయి... ఇది మూడో ప్రపంచ యుద్ధంగా అవతరిస్తుంది. ప్రపంచంలోని అణ్వస్త్ర దేశాలన్నీ ఈ యుద్ధంలో భాగస్వాములు కాక తప్పని పరిస్థితి తలెత్తుతుంది.
హోరిసియో విలేగస్ అనే ఓ జ్యోతిష్కుడు 2017 మే 13వ తేదీన మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని తేల్చి చెప్పారు. పెను విధ్వంసం, అపార నష్టం, భారీ మరణాలు ఈ యుద్ధం వల్ల సంభవిస్తాయని తెలిపారు. అక్టోబర్ 13న ఈ యుద్ధం ముగుస్తుందని జోస్యం చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆరంభిస్తారని తెలిపారు. మరో విషయం ఏమిటంటే... డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతారని 2015లోనే విలేగస్ జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో, ఈయన చెబుతున్న మాటలను తక్కువగా అంచనా వేయలేమని కొందరు అంటున్నారు.