: డ్రైవర్ తాగి ఉన్నాడని స్టీరింగ్ అందుకుని 15 మందిని బలిగొన్నాడు... ఏర్పేడు ప్రమాదంలో లారీ నడిపింది క్లీనరే!
చిత్తూరు జిల్లా ఏర్పేడులో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ నడిపింది క్లీనరేనని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు లారీ యజమాని, డ్రైవర్, క్లీనర్లను అరెస్ట్ చేశారు. డ్రైవర్ గురవయ్య పూర్తిగా మద్యం మత్తులో ఉండడంతో లారీ నడపలేడని భావించిన క్లీనర్ సుబ్రహ్మణ్యం స్టీరింగ్ అందుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు లారీని తానే నడిపానని క్లీనర్ అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప కథనం ప్రకారం..
హైదరాబాద్‌లోని నాచారం నుంచి ఎరువుల లోడ్‌తో లారీ బయలుదేరింది. నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం అక్కరపాకు గ్రామానికి చెందిన గురవయ్య లారీ డ్రైవర్ కాగా, సుబ్రహ్మణ్యం క్లీనరు. హైదరాబాద్ నుంచి కొంత దూరం వచ్చాక మార్గమధ్యంలో లారీ ఆపిన గురవయ్య మద్యం తాగాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో సుబ్రహ్మణ్యం లారీని నడిపాడు. శుక్రవారం ఉదయం లారీ కడప సమీపంలోకి చేరుకున్నాక గురవయ్య మరోమారు మద్యం తీసుకున్నాడు.
దీంతో అతడు లారీ నడిపే స్థితిలో లేడని భావించిన క్లీనర్ సుబ్రహ్మణ్యం మళ్లీ తానే నడిపాడు. అయితే మార్గమధ్యంలో లారీని తాను నడుపుతానని గురవయ్య చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాగి ఉన్న నువ్వు లారీ నడపలేవని, కాబట్టి తానే తోలుతానని క్లీనర్ చెప్పాడు. అయినా వినని గురవయ్య బలవంతంగా స్టీరింగ్ తీసుకుని రేణిగుంట వరకు లారీ నడిపాడు. అక్కడి నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని భావించిన క్లీనర్ మళ్లీ గురవయ్య నుంచి స్టీరింగ్ తీసుకున్నాడు.
ఈ క్రమంలోనే ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద అదుపు తప్పిన లారీ భారీ ప్రమాదానికి కారణమైంది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్, క్లీనర్ మధ్య వాదులాట జరిగిందని, ప్రమాదానికి అది కూడా ఒక కారణమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 21న ఉదయం ఏడు గంటల ప్రాంతంలో లారీ అలన్‌ఖాన్‌పల్లె టోల్‌గేటుకు చేరుకున్నాక అక్కడ క్లీనర్ సుబ్రహ్మణ్యం లారీ గేరు మార్చి ముందుకు నడిపేందుకు ఆపసోపాలు పడినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. భారీ వాహనాలు నడిపే లైసెన్స్ లేని గురవయ్యను 14 చక్రాల భారీ లారీకి డ్రైవర్‌గా పెట్టుకున్న యజమాని రమేశ్, డ్రైవర్ గురవయ్య, క్లీనర్ సుబ్రహ్మణ్యంలపై 304(పార్ట్ 2) కింద హత్య కేసు నమోదు చేసి ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం (నేడు) వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు.