: షర్మిలపై సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసినప్పుడు.. మీరు ఫిర్యాదు చేయలేదా?: సోమిరెడ్డి


ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేసి, విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను టీడీపీ ప్రభుత్వం హరిస్తోందని వారు మండిపడుతున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో టీడీపీ ప్రభుత్వంపై దాడి కొనసాగించాలంటూ ఆ పార్టీ అధినేత జగన్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతల వైఖరిని తప్పుబట్టారు. జీతాలను ఇచ్చి, సోషల్ మీడియాను వైసీపీ నడుపుతోందని ఆయన విమర్శించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన రవికిరణ్ కు నేర చరిత్ర ఉందని... చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన కిరణ్ కు విజయసాయిరెడ్డి మద్దతు తెలపడం దిగజారుడు తనమని అన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ అధికారులను బెదిరించడం విజయసాయిరెడ్డికి తగదని... ఇలాగే బెదిరింపులకు పాల్పడితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. జగన్ సోదరి షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే... గతంలో మీరు ఫిర్యాదులు చేయలేదా? అని ప్రశ్నించారు. మీకొక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా? అని అన్నారు.

  • Loading...

More Telugu News