: 28 రన్స్ కే ఆలౌటై పరువు పోగొట్టుకున్న చైనా.. రవీంద్ర జడేజా జోక్
అన్ని రంగాల్లో దూసుకుపోతున్న చైనా క్రికెట్ లో మాత్రం ఇంకా పసి కూనే. తాజాగా వరల్డ్ క్రికెట్ లీగ్ క్వాలిఫయింగ్ మ్యాచ్ లో చైనా కేవలం 28 పరుగులకే ఆలౌట్ అయింది. సౌదీ అరేబియాతో జరిగిన ఈ మ్యాచ్ లో 390 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని పొందింది. ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో అతి తక్కువ స్కోరుకే ఆలౌటైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ఈ చెత్త రికార్డు జింబాబ్వే పేరుపై ఉండేది. 2004లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే 35 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌదీ అరేబియా నిర్ణీత 50 ఓవర్లలో 418 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ కు దిగిన చైనా 12.4 ఓవర్లలో 28 పరుగులు చేసి, ఆలౌట్ అయింది. చైనా సాధించిన ఈ ఘనత పట్ల జోకులు పేలుతున్నాయి. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ట్విట్టర్లో ఈ విషయంపై జోకు పేల్చాడు. చైనా వస్తువులు ఎక్కువ కాలం మన్నవంటూ ట్వీట్ చేశాడు.