: మీకు మా మామిడి, వరి.. మాకు మీ బీన్స్, పాస్తా!: రష్యాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం!


ఎగుమతి, దిగుమతుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, రష్యాలోని చెల్యాబినిస్క్ ప్రభుత్వాలు ఓ ఏకాభిప్రాయానికొచ్చాయి. గతేడాది రష్యాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో పర్యటించాల్సిందిగా చెల్యాబినిస్క్ ప్రభుత్వ ప్రతినిధులను కోరారు. ఈ మేరకు శనివారం ఆ రాష్ట్ర గవర్నర్ బోరిస్‌ డుబ్రోవిస్కీ ఆధ్వర్యంలో వివిధ కంపెనీల సీఈవోల బృందం ఏపీకి చేరుకుని సీఎంతో సమావేశమైంది. ఈ సందర్భంగా పరిశ్రమల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇరు ప్రాంతాలు పరస్పరం లబ్ధిపొందేలా ఎగుమతి, దిగుమతుల విషయంలో ఓ ఒప్పందానికి వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి వరి, మామిడి, మసాల దినుసులు, సిరామిక్ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు చెల్యాబినిస్క్ ఆసక్తి చూపించగా అక్కడి నుంచి బీన్స్, పాస్తాలను దిగుమతి చేసుకోవాలని ఏపీ నిర్ణయించింది. అలాగే ఇరు రాష్ట్రాల్లోని విద్యార్థులు, రైతులు విజ్ఞానాన్ని పంచుకునేందుకు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ సుస్థిరత గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు చెల్యాబినిస్క్ ప్రతినిధులకు వివరించారు. సీఎంతో సమావేశం అనంతరం చెల్యాబినిస్క్‌ ప్రతినిధులు వెలగపూడిలోని సచివాలయాన్ని సందర్శించి అతి తక్కువ కాలంలో అద్భుతంగా నిర్మించినందుకు అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News