: మోదీని కలిసేందుకు తొలిసారి బయలుదేరిన పళనిస్వామి... కీలక చర్చలకు అవకాశం
తమిళనాట అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా ఉన్న మాజీ సీఎం పన్నీర్ సెల్వం, ప్రస్తుత సీఎం పళనిస్వామిలు కలిసిపోతారని వార్తలు వస్తున్న వేళ, నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు పళనిస్వామి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా మోదీని కలవనుండటంతో, ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పళని, పన్నీర్ వర్గాల విలీనం అనంతరం, ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే చేరుతుందని, వీరిద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని వార్తలు వచ్చిన నేపథ్యంలో పళని ఢిల్లీకి బయలుదేరడం గమనార్హం. బీజేపీ పెద్దల నుంచి వచ్చిన పిలుపు మేరకే పళని ఈ ప్రయాణం పెట్టుకున్నట్టు సమాచారం. ఇక పన్నీర్, పళనిలు ఈ నెల 24న స్వయంగా సమావేశమై, పార్టీ విలీనంపై తుది చర్చలు జరిపి, ఓ నిర్ణయానికి వస్తారని ఇరు వర్గాల ప్రతినిధులు తెలిపారు.