: కట్టప్ప క్షమాపణలు చెప్పినా వెనక్కు తగ్గని కన్నడ సంఘాలు... నిర్మాతల్లో ఆందోళన!
కన్నడనాట బాహుబలి-2 విడుదలకు అడ్డంకులింకా తీరలేదు. సత్యరాజ్ స్వయంగా నిన్న మీడియాకు ప్రకటన విడుదల చేస్తూ, కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పినప్పటికీ, వేడి చల్లారలేదు. ఆయన స్వయంగా కర్ణాటకకు వచ్చి, క్షమాపణలు చెప్పాల్సిందేనని 'కన్నడ ఒకూట' సంస్థ అధ్యక్షుడు వటల్ నాగరాజ్ స్పష్టం చేశారు. ఇక ఈ నెల 28న కర్ణాటకలో రాష్ట్ర బంద్ కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. అది కూడా బాహుబలి-2కు వ్యతిరేకంగా. దీంతో చిత్ర నిర్మాతల్లో ఆందోళన మరింతగా పెరిగినట్టు తెలుస్తోంది.
ఇక ఈ మొత్తం వ్యవహారంపై కేఆర్వీ (కర్ణాటక రక్షణ వేదిక) అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి స్పందిస్తూ, ఆ సినిమా దర్శకులు, నిర్మాతలు ఫిల్మ్ చాంబర్ ను, మధ్యవర్తులను సంప్రదించడం వృథా అని, కావేరీ సమస్య సందర్భంగా తమను కుక్కలతో పోల్చిన సత్యరాజ్ ను క్షమించేది లేదని, ఆయన నటించిన చిత్రాన్ని విడుదల చేయాలంటే, సత్యరాజ్ బేషరతు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆ తరువాతే సినిమా విడుదలకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు.