: ఆఫ్ఘన్ లో ఆర్మీ యూనిఫాంలో వచ్చి 50 మంది సైనికులను హతమార్చిన టెర్రరిస్టులు!
ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా పెద్దబాంబు వేసిన అనంతరం భారీ ఉగ్రదాడి చోటుచేసుకుంది. తాలిబాన్ ఉగ్రవాదులు ఆర్మీ బేస్ పై విరుచుకుపడి భారీ స్థాయిలో సైనికులను హతమార్చిన ఘటన కాబూల్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఆఫ్ఘనిస్థాన్ లోని ఉత్తర ప్రాంతంలోని మజర్-ఇ-షరీఫ్ నగరానికి సమీపంలో ఉన్న ఆర్మీ బేస్ కు పది మంది ఉగ్రవాదులు సైనికుల యూనిఫాంలో వచ్చారు. 8 మంది ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా, దూసుకెళ్లిన ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో 50 మందికి పైగా ఆఫ్ఘన్ సైనికులు మృతి చెందారని యూఎస్ మిలిటరీ స్పోక్స్ పర్సన్ తెలిపారు. ఆర్మీబేస్ వద్దగల మసీదు, డైనింగ్ హాల్ ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. కాగా, ఈ ఘటనలో కౌంటర్ అటాక్ లో ఆత్మాహుతి దాడికి తెగబడిన ఉగ్రవాదులకు బ్యాకప్ ఇచ్చిన ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఒక ఉగ్రవాదిని అదుపులో తీసుకున్నారు.