: 14 మంది అమ్మాయిలను ఫేస్ బుక్ లో ఎలా చీట్ చేశాడో తెలుసా?
సోషల్ మీడియాలో స్నేహం చేయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఎంత ఎక్కువ మంది ఫాలోయర్లు ఉంటే అంత గ్రేటు. దీంతో సోషల్ మీడియాలో అపరిచితుల స్నేహం కోసం వెంపర్లాడడం...రెండు మంచి ముక్కలు చెప్పగానే నిజమైన స్నేహితుడని నమ్మడం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం...ఆ తరువాత అవతలి వ్యక్తి అసలు నైజాన్ని గుర్తించి తీరిగ్గా బాధపడడం, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి గోముఖ వ్యాఘ్రం గురించి ఒక యువతి హైదరాబాదు షీటీమ్స్ ను ఆశ్రయించడంతో అతను 14 మందిని మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ కి చెందిన 30 ఏళ్ల యువకుడు వేర్వేరు పేర్లు, నకిలీ సమాచారంతో ఫేస్ బుక్ ఖాతాలు ప్రారంభించాడు. ఫ్రెండ్షిప్ పేరుతో 15-17 సంవత్సరాల మధ్య వయసుగల అమ్మాయిలకు మాత్రమే రిక్వెస్టు పంపేవాడు. ఇలా అతడి ఫ్రెండ్షిప్ అభ్యర్థనను చాలామంది అమ్మాయిలు అంగీకరించారు. వారితో గంటల తరబడి చాటింగ్ చేసేవాడు. వారి సమస్యలు తెలుసుకుని మరీ వారిని ఓదార్చేవాడు. నేనున్నానంటూ భరోసా ఇచ్చేవాడు.
దీంతో ఆ యువతులు వారి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఐపీ, పాస్ వర్డ్ లు చెప్పేవారు. దాంతో, వారు తమ స్నేహితులు, లవర్స్ తో సాగించిన ప్రేమకలాపాలు, చాటింగ్స్, ప్రైవేటు సంభాషణలను సేకరించేవాడు. ఆ తరువాత అతనిలో అసలు వ్యక్తి మేల్కొనేవాడు. రహస్య సమాచారం బట్టబయలు చేస్తానని బెదిరించేవాడు. బాయ్ ఫ్రెండ్స్ సంభాషణలు కుటుంబ సభ్యులకు పంపుతానని బెదరగొట్టేవాడు. అలా చేయకుండా ఉండాలంటే నగ్నఫోటోలు పంపాలని కోరేవాడు. వారు అలా పంపిన తరువాత ఆ ఫోటోలు బహిర్గతం చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు.
నలుగురు అమ్మాయిలు అతని బెదిరింపులకు తలొగ్గి, ఫోటోలు పంపారు. తరువాత వాడు అడిగినట్టు ఒకమ్మాయి లక్ష రూపాయలు ఇస్తే, పదో తరగతి విద్యార్థిని మెళ్లో గొలుసు అమ్ముకుని డబ్బులిచ్చింది. ఇంటర్ చదువుతున్న యువతి గొలుసు అతనికి చదివించింది. అయినా డబ్బులు అడగడంతో ధైర్యం చేసి షీటీమ్స్ కు జరిగింది వివరించింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేయగా, అతని వలలో 14 మంది పడ్డట్టు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడు చిక్కితే అతని వలలో ఇంకెంతమంది పడ్డారో తెలుస్తుందని చెప్పారు. అతని కోసం గాలింపు చేపట్టారు. బాధితుల వివరాలు రహస్యంగా ఉంచారు.