: అయేషా కేసు సుప్రీంకా, సీబీఐకా?.. తర్జన భర్జనలో పోలీసులు!


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసులో హైకోర్టు సంచలన తీర్పు తర్వాత పోలీసుల అంతర్మథనం మొదలైంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సత్యంబాబుకు సెషన్స్ కోర్టు విధించిన జీవిత ఖైదునే హైకోర్టు కూడా సమర్థిస్తుందని పోలీసులు భావించారు. అయితే హైకోర్టు తీర్పు అందుకు భిన్నంగా రావడంతో పోలీసు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో ఎలా వ్యవహరించాలో తెలియక పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలా? లేక సీబీఐకి అప్పగించాలా? అన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నా ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయ నిపుణులతో అధ్యయనం చేయించిన తర్వాతే ఈ విషయంలో అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు అయేషా తల్లిదండ్రులు కనుక అంగీకరిస్తే కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోలీసులు కూడా అదే మేలని భావిస్తున్నారు. అయితే ఈ కేసును సీబీఐ స్వీకరిస్తుందా? లేదా? అన్న సంశయం పోలీసులను పట్టిపీడిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సర్కారు అనుమతిచ్చినా కోర్టు ఆ పిటిషన్‌ను స్వీకరిస్తుందా? అన్న అనుమానాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేని పోలీసులు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు.

 
 

  • Loading...

More Telugu News