: టెస్టు ఆటగాడే కానీ... ఐపీఎల్ లో మాత్రం ఉతికేశాడు!
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లాను తీసుకున్నప్పుడు ఆ జట్టు నిర్ణయానికి అంతా నవ్వుకున్నారు. హషీమ్ ఆమ్లా సీనియర్ ఆటగాడు. టెస్టుల్లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. సఫారీ టెస్టు జట్టులో హషీమ్ ఆమ్లా ప్రధాన ఆటగాడు. అతనికి టెస్టు ఆటగాడన్న ముద్ర పడిపోయింది. అలాంటి వాడిని ఎందుకు తీసుకున్నారు? మెంటర్ గా పనికొస్తాడేమో అని అంతా అనుమానం వ్యక్తం చేశారు. అయితే తాను అనుభవమున్న ఆటగాడినని, క్రికెట్ ను ఆస్వాదిస్తానని హషీమ్ ఆమ్లా టీ20లో సెంచరీ సాధించడం ద్వారా చాటాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు హషీమ్ ఆమ్లా తిరుగులేని ఆరంభంతోపాటు అంతాన్ని కూడా ఇచ్చాడు. ఆమ్లా సాధారణంగా సిక్సర్లు కొట్టడనే అపప్రధను కూడా ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో పోగొట్టుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చివరి వరకు 60 బంతులు అంటే సరిగ్గా పది ఓవర్లు ఆడిన హషీమ్ ఆమ్లా 8 బౌండరీలు, 6 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. బౌలర్ ఎవరన్న అంశంతో పని లేకుండా బౌండరీలు సిక్సర్లతో హోరెత్తించాడు. దీంతో తన కెరీర్ లో తొలి టీ20 సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో మలింగ తన 4 ఓవర్ల కోటాలో 51 పరుగులు సమర్పించుకుని ఐపీఎల్ లో రెండవ పేలవ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు.