: ఉగ్రవాదులను కాల్చిపారేయండి... కేసులుండవు!: పౌరులకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సలహా
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టె మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దేశంలో తీవ్రవాదాన్ని నిరోధించేందుకు పౌరులను సాయుధులుగా మార్చాలని భావిస్తున్నారు. ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. బొహాల్ ప్రావిన్స్‌లో విచ్చలవిడిగా పెరిగిపోయిన తీవ్రవాదాన్ని నిరోధించేందుకు పౌరుల చేతికి మారణాయుధాలు ఇవ్వాలని అనుకుంటున్నానని, తాను కూడా వారితోనే కలిసి నడుస్తానని అన్నారు.
ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారిని కాల్చి చంపినా ఎటువంటి శిక్షలు ఉండబోవని పేర్కొన్నారు. ఉగ్రవాదులను చంపేసిన వారు భయపడాల్సిన అవసరం లేదని, దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాస్తవం చెబితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభయం ఇచ్చారు. పర్యాటక కేంద్రమైన బొహాల్‌లో గతవారం అబూ సయ్యఫ్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు పోలీసులు, జవాను, ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో డ్యటెర్టె తాజా నిర్ణయం కలకలం రేపుతోంది.