: జైల్లో ఎవరైనా ఒకటే...మాఫియా డాన్లకు కూడా సాధారణ ఆహారమే అందించండి: యోగి ఆదిత్యనాథ్ ఆదేశం
సంచలన నిర్ణయాలతో ఆకట్టుకుంటున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జైళ్ల శాఖపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా జైలులో పెట్టే ఆహారంపై ఆరాతీశారు. అందరికీ ఒకే రకమైన ఆహారం అందడం లేదని, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి అదనపు సౌకర్యాలతో పాటు ప్రత్యేక భోజనం అందుతోందన్న ఆరోపణలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
జైల్లో రిమాండ్ లేదా శిక్ష పడ్డ ఖైదీలందరికీ ఒకే రకమైన ఆహారం అందజేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి జైలులో మొబైల్ ఫోన్లు పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు బేఖాతరు చేసినా, నిర్లక్ష్యంతో వ్యవహరించినా కఠిన చర్యలుంటాయని ఆయన అధికారులను హెచ్చరించారు. జైలుకు వచ్చినవారు ఎంతటి వారైనా ఒకటేనని ఆయన తెలిపారు. ప్రధానంగా మాఫియా డాన్ల విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవన్న విషయం గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా, రాజకీయ పలుకుబడి ఉన్న మాఫియా డాన్లకు ప్రత్యేక ఆహారం, సెల్ ఫోన్లు, ఇతర సౌకర్యాలు జైల్లో నిరాటంకంగా అందుతాయని ఆరోపణలు ఉన్నాయి.