: అందుకే మన ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలకు ఏ మాత్రం పనికిరాకుండా పోతున్నారు.. సర్వేలో ఆసక్తికర విషయాలు!
ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో ఉద్యోగాలు చేసే నైపుణ్యాలపై యాస్పైరింగ్ మైండ్స్ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఇంజినీరింగ్ చదివిన వారిలో 95.33 శాతం మంది విద్యార్థులకు అసలు ప్రోగ్రామింగ్ కోడ్ రాయడమే రాదని తేలింది. కేవలం 4.77% మంది మాత్రమే ఒక ప్రోగ్రాంకు సరైన లాజిక్ రాయగలుగుతున్నారని తేల్చి చెప్పింది.
కాలేజీల్లో నాలుగేళ్లు చదివి ఇంజనీరింగ్ పట్టాలు పట్టుకొని, అనంతరం నిరుద్యోగులుగా మిగిలిపోవడానికి ఇదే కారణమని తెలిపింది. తమ సర్వేలో భాగంగా యాస్పైరింగ్ మైండ్స్ సంస్థ మొత్తం 500 కాలేజీలకు చెందిన ఐటీ సంబంధిత బ్రాంచీలలో చదివే 36 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలకు సంబంధించిన ఆటోమేటా అనే పరీక్ష పెట్టి ఈ గణాంకాలను వివరించి చెప్పింది.
తాము పరీక్ష పెట్టిన వారిలో మూడింట రెండు వంతుల మంది అసలు కనీసం ఇచ్చిన సమస్యకు సరిపోయే కోడ్ కూడా రాయలేకపోయారని ఆశ్చర్యం గొలిపే విషయాలను తెలిపింది. కేవలం 1.4% మంది విద్యార్థులు మాత్రమే తాము ఇచ్చిన సమస్యకు పనిచేసే కోడ్ రాశారని చెప్పింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల్లో ఈ నైపుణ్యాలు లేకపోవడం ఐటీ, డేటా సైన్స్ పరిస్థితిని దారుణంగా దెబ్బ తీస్తోందని తెలిపింది. ప్రపంచమంతా ప్రోగ్రామింగ్‌లో అద్భుతంగా రాణిస్తూ ముందుకు వెళుతోంటే మన దేశ ఇంజినీరింగ్ విద్యార్థుల్లో మాత్రం పరిస్థితి ఇలా ఉందని పేర్కొంది.
మనదేశ విద్యార్థుల్లో ఈ నైపుణ్యాల లేమికి ముఖ్య కారణం కళాశాలల్లో ప్రోగ్రామింగ్ గురించి వారికి సరిగా చెప్పకపోవడమేనని యాస్పైరింగ్ మైండ్స్ సంస్థ పేర్కొంది. కాలేజీల్లో వేర్వేరు రకాల సమస్యలకు సరిపోయే ప్రోగ్రాంలు రాయించడం అలవాటు చేయట్లేదని తెలిపింది. ప్రోగ్రామింగ్‌కు కావల్సిన మంచి అధ్యాపకులు కూడా ఉండడం లేదని పేర్కొంది.