: సుప్రీంకోర్టులో ధోనీకి ఊరట.. కేసు కొట్టివేత!
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2013లో బిజినెస్ టుడే మేగజీన్ కవర్ పేజ్ పై విష్ణుమూర్తి ఆకారంలో ధోనీ ఫొటో ప్రచురితమైంది. ఈ ఫొటోలో ధోనీ చేతుల్లో ఆయన బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్ కూడా ఉంచారు. ఈ ఫొటోతో హిందువుల మనోభావాలు గాయపడ్డాయంటూ అనంతపురం జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు దాఖలయింది. బెంగళూరు కోర్టులో కూడా ఈ కేసు విచారణ జరిగింది. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే, ఈ ఫొటో వివాదంలో ధోనీ పాత్ర ఏమాత్రం లేదని, అందువల్ల కేసును కొట్టివేయాలంటూ ధోనీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరు వైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు... ధోనీ ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదని అభిప్రాయపడింది. కేసును కొట్టి వేసింది. దీంతో, ధోనీకి ఉపశమనం లభించినట్టైంది.