: సీన్ రివర్స్.. అమెరికా వైఖరిని కొనియాడి.. ఉత్తరకొరియాపై విమర్శలు చేసిన చైనా!
ఉత్తరకొరియా పట్ల స్నేహభావంతో ఉంటున్న చైనా ఈ రోజు తాము కనబరుస్తున్న తీరుకి భిన్నంగా ఆ దేశంపై విమర్శలు గుప్పించింది. అలాగే, ఉత్తర కొరియా విషయంలో అమెరికా తీరుని కొనియాడింది. తాము వారానికోసారి క్షిపణి పరీక్షలు నిర్వహిస్తామని, తమ తీరుని ఎవరైనా బెదిరిస్తే అణ్వాయుధాలు ప్రయోగించడానికి వెనుకాడబోమని ఉత్తర కొరియా పలు వ్యాఖ్యలు చేసి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన చైనా... ఆ దేశం నుంచి ఎదురవుతున్న అణ్వాయుధ సమస్యను నివారించడానికి సాధ్యమైనంతగా శాంతియుత మార్గాలనే అన్వేషిస్తామని అమెరికా చేసిన ప్రకటనను ప్రశంసించింది. అమెరికా చేసిన ప్రకటన ఎంతో సానుకూలమైనదని, నిర్మాణాత్మకమైనదని పేర్కొంది. ఆమెరికా తీరు సరైనదేనని తాము భావిస్తున్నట్లు చైనా చెప్పింది.