: విలియమ్సన్ వీరవిహారం...సన్ రైజర్స్ నాలుగో విజయం


సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు ఉప్పల్ స్టేడియం కలిసివచ్చింది. ఇతర వేదికలపై ఆడేటప్పుడు తడబడుతున్న సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు సొంతగడ్డపై జరిగే మ్యాచుల్లో మాత్రం విజయాలతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉప్పల్ స్టేడియంలో ఆడిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్సన్ వీరవిహారం చేశాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బలమైన బౌలింగ్ విభాగం కలిగిన ఢిల్లీ, కట్టుదిట్టమైన బంతులతో కట్టడి చేసే ప్రయత్నం చేసింది. అయితే విలియమ్సన్ మాత్రం వారి బంతులకు భయపడలేదు. గుడె లెంగ్త్ అయినా, షార్ట్ పిచ్ అయినా, బౌన్సర్ అయినా, గింగిరాలు తిరిగే స్పిన్ అయినా అతని బ్యాటు దగ్గర సరైన సమాధానం ఉండేది.

దీంతో కేవలం 51 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన ధావన్, విలియమ్సన్ అవుట్ కావడంతో జూలు విదిల్చి 50 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 70 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ (3) విఫలమవడంతో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు శ్రేయస్‌ అయ్యర్‌ (50), సంజు శామ్సన్‌ (42), కరుణ్‌ నాయర్‌ (33), మాథ్యూస్‌ (31) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాదు జట్టుకు కూడా పుష్కలమైన బౌలింగ్ వనరులు ఉండడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటలు సాగలేదు. వీరవిహారం చేసిన కేన్ విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

  • Loading...

More Telugu News