: కన్నడనాట కట్టప్ప వివాదం...రాజమౌళికి తలనొప్పి
కన్నడనాట రాజమౌళికి చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఎన్నో ఆశలతో 'బాహుబలి-2 కన్ క్లూజన్' సినిమాను దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయాలని, పక్కా ప్రణాళికతో భారీ ప్రచారం నిర్వహిస్తున్న రాజమౌళికి కన్నడనాట షాక్ తప్పేలా కనిపించడం లేదు. గతంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని కర్ణాటకకు చెందిన ఒకోటా సంస్థ బీష్మించుకుని కూర్చుంది. పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాద్ధాంతం ఎందుకు? అని రాజమౌళి సదరు సంస్థకు ప్రశ్న సంధిస్తూ, సర్దుకుపోవాలని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక సంఘాలు మరింత మండిపడుతున్నాయి.
వివాదం సద్దుమణగాలంటే కట్టప్పతో క్షమాపణలు చెప్పించాలని ఒకోటా సంస్థ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో సినిమా విడుదల రోజు బంద్ కు పిలుపునిస్తున్నామని ఆ సంస్థ ప్రకటించింది. తమ సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యకర్తలు ఉన్నారని, సినిమా విడుదలైన ధియేటర్ల దగ్గర సినిమా ప్రదర్శనను అడ్డుకుంటారని ఆ సంస్థ హెచ్చరించింది. తమ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ఎగ్జిబిటర్లు చిత్రాన్ని ప్రదర్శిస్తే... తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యరాజ్ (కట్టప్ప) క్షమాపణలు చెబితే సినీ నటులను దేవుళ్లుగా ఆరాధించే తమిళనాడులో సమస్య ఉత్పన్నమవుతుంది. లేకపోతే కర్ణాటకలో సమస్య... ఈ నేపథ్యంలో రాజమౌళికి తలనొప్పి ప్రారంభమైంది.