: నంద్యాల ఉప ఎన్నిక టిక్కెట్ విషయమై టీడీపీలో రసవత్తర రాజకీయం.. చంద్రబాబుతో మరోసారి శిల్పా సోదరుల భేటీ
ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి తన సోదరుడితో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, శిల్పా సోదరులు విజయవాడలోని చంద్రబాబు నాయుడి నివాసంలో మరోసారి సీఎంతో భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా తననే పోటీకి దింపాలని శిల్పా మోహన్‌రెడ్డి కోరుతున్నారు.
తమకు టిక్కెట్ ఇవ్వకుంటే తమ ఉనికికే ప్రమాదం అని ఆయన అంటున్నారు. మరోవైపు భూమా కుటుంబ సభ్యులు నంద్యాల టిక్కెట్‌ను వదులుకునే ప్రసక్తేలేదని అంటున్నారు. దీంతో నంద్యాల ఉప ఎన్నిక విషయమై టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. కొద్దిసేపటి క్రితం నంద్యాల ఉప ఎన్నిక విషయమై శిల్పా మోహన్ రెడ్డితో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆది నారాయణ రెడ్డిలు చర్చించారు. అనంతరం తమ భేటీ వివరాలను సీఎం చంద్రబాబుకు చెప్పారు.