: ఇది ముమ్మాటికీ అద్వానీపై మోదీ కుట్రే: లాలూ ప్రసాద్ యాదవ్


బాబ్రీ మసీదు కూల్చివేత కేసును తిరగదోడటం వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కురువృద్ధుడు అద్వానీ భారత రాష్ట్రపతి పదవికి పోటీ పడకుండా ఉండేందుకు ప్రధాని మోదీ ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. సీబీఐ అనేది ప్రధాని చెప్పుచేతుల్లో ఉంటుందని... బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టులో ఈ రోజు అద్వానీకి వ్యతిరేకంగా సీబీఐ వ్యవహరించిందని లాలూ అన్నారు. కాబోయే రాష్ట్రపతి అద్వానీయే అనే ప్రచారం జరుగుతున్న సమయంలో... ఆయన పోటీలో లేకుండా చేసేందుకే మోదీ రాజకీయ కుట్ర చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరని అన్నారు. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో తనను అద్వానీ కాపాడారన్న విశ్వాసం కూడా మోదీకి లేదని లాలూ అన్నారు. అప్పట్లో సీఎం పదవి నుంచి మోదీని తొలగించాలని వాజ్ పేయి భావించినప్పటికీ, అద్వానీ అడ్డుపడ్డారని... కానీ మోదీ మాత్రం విశ్వాసం లేకుండా వ్యవహరించారని చెప్పారు.

  • Loading...

More Telugu News