: అప్పుడు నా కళ్లు నెత్తికెక్కాయి...ఇంట్లో వాళ్లు చితక్కొట్టేశారు: సినీ నటి అంజలి


అచ్చతెలుగు సినీ నటి అంజలి తన స్కూల్, కాలేజీ రోజులను నెమరువేసుకుంది. ఈ సందర్భంగా మళ్లీ ఆ రోజులకు వెళ్లిపోతే బాగుండునని పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో చదువుకున్న అంజలి... తాను చదువుకునే రోజులపై మాట్లాడుతూ, ‘‘టెన్త్ క్లాస్‌ బాగా చదవడంతో నా కళ్లు నెత్తికెక్కాయి. అప్పట్లో బాగా చదివేదాన్ని... మా బ్యాచ్‌లో నేనే ఫస్ట్‌ క్లాస్‌... అయితే చదువుకి మించిన అల్లరి చేసేదాన్ని. అంతే కాదు, హైస్కూల్‌ వరకు నేనెప్పుడూ క్లాస్ కి బంక్‌ కొట్టలేదు. దానికి తోడు టెన్త్ లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. అంతే, ఇంటర్‌ ఫస్టియర్‌ కి వచ్చేసరికి నా కళ్లు నెత్తికెక్కాయి.

సరిగ్గా అప్పుడే ‘నువ్వే కావాలి’ సినిమా విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తోపాటు...యూత్‌ లో ఆ సినిమాకు బాగా క్రేజ్‌ ఏర్పడింది. దాంతో ఆ సినిమా ఎలాగైనా చూడాలనుకున్నాను. కాలేజీకి బంక్ కొట్టామని తెలిస్తే ఇంట్లో కోప్పడతారు. దగ్గర్లో సినిమా హాలుకి వెళ్తే ఇంట్లో తెలిసిపోతుంది. అందుకే ఒక రోజు కాలేజీకి బంక్‌ కొట్టి, కొంచెం ఎక్కువ దూరంలో ఉన్న సినిమా హాల్‌ కు ఫ్రెండ్స్ తో వెళ్లాను. ఎవరూ చూడరని ధైర్యంగా ఉన్నాను. సినిమా చూసి ఇంటికి ఆనందంగా చేరుకున్నాను...అయితే నేను ఇంటికి చేరే లోపే నేను కాలేజీకి బంక్ కొట్టి సినిమాకు వెళ్లానన్న వార్త చేరిపోయింది. అంతే, ఇంట్లో వాళ్లు చితక్కొట్టేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కాలేజీకి బంక్‌ కొట్టి సినిమాకు గానీ, షికారుకు గానీ వెళ్లలేదు. ఆ రోజులు తలచుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో!’’ అని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News