: సుదీర్ఘకాలం తరువాత ఫాంలోకి వచ్చిన యూసుఫ్ పఠాన్... మెరుపులతో ఢిల్లీ ఆశలకు గండి!
కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్ యూసుఫ్ పఠాన్ సుదీర్ఘ కాలం తరువాత ఫాంలోకి వచ్చాడు. ఐపీఎల్ తొలి భాగాల్లో డాషింగ్ షాట్లతో బంతిని బౌండరీ దాటించే యూసుఫ్ పఠాన్... టీమిండియాలో ఫాం లేమితో చోటుకోల్పోయాడు. తరువాత పూర్వపు వైభవాన్ని అందుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. అయినప్పటికీ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అతనిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ అతనిని ఈసారి కూడా జట్టుతో ఉంచుకుంది. దీంతో జట్టుకు తనపై ఉన్న నమ్మకాన్నినిలబెట్టుకోవాలని కష్టపడ్డ యూసుఫ్... కేవలం 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కోల్ కతా నైట్ రైడర్స్ ను మరోసారి తన పాత పనితనాన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లకు రుచిచూపిస్తూ, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 35 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతనికి జతగా మనీష్ పాండే (34) ఫాంను చాటుకున్నాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ కష్టాల నుంచి గట్టెక్కింది. 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. కోల్ కతా విజయానికి 36 బంతుల్లో 44 పరుగులు కావాల్సి ఉంది. ఆరంభంలో అద్భుతంగా బంతులు విసిరిన ఢిల్లీ బౌలర్లు మధ్యలో లయతప్పడంతో కోల్ కతా విజయంవైపు దూసుకుపోతోంది.