: షాకింగ్ న్యూస్... పదేళ్లలో సముద్రంలో మునిగిపోనున్న కాకినాడ, భీమవరం, పాలకొల్లు?
ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనానికి మారుపేరుగా నిలిచిన కాకినాడ, భీమవరం, పాలకొల్లు ప్రాంతాలు మరో పదేళ్లలో సముద్ర గర్భంలో కలిసిపోనున్నాయా? అంటే అవునని నిపుణులు, ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం గ్లోబల్ వార్మింగో లేక, పెరుగుతున్న సముద్ర మట్టాలో కాదని వారు చెబుతున్నారు. కాకినాడ తీరంలో పాగావేసిన చమురు వెలికితీసే సంస్థల అడ్డగోలు తవ్వకాలని వారు చెబుతున్నారు. అడ్డగోలుగా సహజవాయు నిక్షేపాలు తవ్వుకుని తీసుకుపోతుండడంతో దాని ప్రభావం తమపై పడుతోందని, తమ జీవనాధారం, కొంప, గోడు, గొడ్డు, గోద మొత్తం అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
విశాఖపట్టణంలో ఏడాదికి 0.65 సెంటీ మీటర్ల సముద్ర మట్టం పెరుగుతుండగా, గత నాలుగైదేళ్లలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఈ మూడు ప్రాంతాలు మాత్రం ఐదు అడుగుల లోతుకు భూమిలోకి దిగబడిపోయాయని వారు చెబుతున్నారు. ఈ మేరకు పలువురు నిపుణులతో కూడిన కృష్ణా, గోదావరి పరిరక్షణ సమితి ఆందోళణ వ్యక్తం చేస్తోంది. రాజకీయ పార్టీలన్నీ కలిపి దీనిపై పోరాడితేనే ఇక్కడి ప్రజల మనుగడ ఉంటుందని, లేని పక్షంలో వివిధ ప్రాంతాలకు వలసపోయి జీవనోపాధిని వెతుక్కోవడమే అవుతుందని వారు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.