: 'మహాభారత్'కు వెండితెర రూపం... 1000 కోట్లతో చిత్ర నిర్మాణం!
భారత ఇతిహాసం 'మహాభారత్'ను 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించేందుకు యూఏఈకి చెందిన వ్యాపారవేత్త గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఇంత భారీ బడ్జెట్ ను ప్రముఖ యాడ్ ఫిలిం రూపకర్త వి.ఎ. శ్రీకుమార్ మేనన్ దర్శకత్వంలో రూపొందించనున్నట్టు తెలుస్తోంది. శ్రీకుమార్ మేనన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారని... దీని పేరు ‘ది మహాభారత్’ గా నిర్ణయించారని తెలుస్తోంది. ప్రముఖ రచయిత ఎం.టి వాసుదేవన్ నాయర్ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనుండగా, ఇందులో భీముడి పాత్ర గురించే ప్రముఖంగా ఉంటుంది.
ఈ సినిమా చిత్రీకరణ 2018 నుంచి ప్రారంభమై 2020 నాటికి పూర్తికానుంది. దీనిని ఆంగ్లం, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించి, ఆ తరువాత 100 విదేశీ భాషల్లో డబ్బింగ్ సినిమాగా విడుదల చేయనున్నారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం నటీనటులను టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంపిక చేయనుండగా, వారిని ఒక అంతర్జాతీయ దర్శకుడు ఎంపిక చేయనుండడం విశేషం. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు.