: ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ, నాకు ఎన్నో సలహాలు ఇచ్చేవారు: నెహ్రూ మృతి పట్ల నారా లోకేష్ ఆవేదన
ఒక విద్యార్థి నాయకుడిగా, యూనియన్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి... దివంగత ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి... ప్రజలకు నిరంతరం సేవ చేసిన ఓ గొప్ప నాయకుడు దేవినేని నెహ్రూ అని ఏపీ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. దేవినేని నెహ్రూ చనిపోయారంటూ ఉదయాన్నే తనకు ఫోన్ వచ్చిందని... తాను షాక్ కు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే ఆయన టీడీపీలో చేరిన సందర్బంగా ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలు, అభిమానులందరినీ... పేరు పేరునా రెండున్నర గంటల పాటు తనకు పరిచయం చేశారని చెప్పారు.
అనునిత్యం తనను డైరెక్ట్ గా కలవకపోయినప్పటికీ... ఎప్పటికప్పుడు తనకు ఫోన్ చేస్తూ ఏం చేస్తే బాగుంటుందో అని అనేక సలహాలు ఇచ్చేవారని లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఒక్కసారి ఏదైనా అనుకుంటే, దాన్ని సాధించేంత వరకు నిరంతరం కష్టపడే వ్యక్తి నెహ్రూ అని అన్నారు. సిద్ధాంతాలు కలిగిన మంచి నేత అని కితాబిచ్చారు. ఇంత గొప్ప నేత, కార్యకర్తను కోల్పోవడం టీడీపీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని, ఆయనను నమ్ముకున్న కార్యకర్తలను టీడీపీ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నెహ్రూ కుమారుడు అవినాశ్ కూడా తనకు మంచి మిత్రుడయ్యాడని... అనేకసార్లు తామిద్దరం మాట్లాడుకున్నామని చెప్పారు. అవినాశ్ కు అండగా టీడీపీ ఉంటుందని తెలిపారు. నెహ్రూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టు చెప్పారు.