: కొడుకు అఖిలేష్ పై ములాయం కొత్త గుస్సా!
2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు భావ సారూప్యత కలిగిన ఏ పార్టీతోనైనా కలిసేందుకు సిద్ధమని బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ప్రకటనను స్వాగతిస్తూ, మహా కూటమిలో కలిసేందుకు సిద్ధమని అఖిలేష్ వ్యాఖ్యానించడంపై సమాజ్ వాదీ నేతాజీ ములాయం సింగ్ యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు అక్కర్లేదని, ఒంటరిగానే సమాజ్ వాదీ సత్తా చాటగలదని, పొత్తు ప్రకటనలతో పార్టీ బలహీనపడ్డ సంకేతాలను పంపుతున్నట్టు అయిందని కొడుకుకు ఆయన చురకలంటించినట్టు తెలుస్తోంది.
పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టకుండా, పొత్తుల గురించి మాట్లాడటమేంటని అఖిలేష్ ను ములాయం మందలించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైతం కాంగ్రెస్ పార్టీతో అఖిలేష్ పొత్తు పెట్టుకోగా, దాన్ని ములాయం తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తొలుత వ్యతిరేకించినప్పటికీ, ఆపై ఆయన కూటమికి అనుకూలంగా మారి ప్రచారం సాగించినప్పటికీ, పార్టీ పరాజయం పాలైంది.