: అసెంబ్లీలోకి రానివ్వకపోవడంతో రోడ్డుపైనే కూర్చున్న రేవంత్, సండ్ర
ఎస్టీ, మైనారిటీలకు మతపరమైన రిజర్వేషన్ల కోటాను పెంచుతూ, తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి, బిల్లుపై చర్చించనున్న వేళ, తెలుగుదేశం సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను అసెంబ్లీలోనికి అనుమతించలేదు. వారిపై సస్పెన్షన్ వేటు ఉన్న కారణంగా, స్పీకర్ అనుమతి లేనిదే లోనికి పంపలేమని భద్రతాధికారులు స్పష్టం చేయడంతో, వారు రోడ్డుపైనే బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ విగ్రహం ముందున్న ఇనుప కంచెకు ఇవతలి వైపున 'తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడండి - తెలుగుదేశం పార్టీ' అని రాసున్న బ్యానర్ ను ప్రదర్శిస్తూ, వారు తమ నిరసనను తెలియజేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి అసెంబ్లీకి పాదయాత్రను ప్రారంభించడంతో, పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని బలవంతంగా పోలీసు స్టేషనుకు తరలించారు. మరికాసేపట్లో సమావేశం కానున్న శాసనసభ మతపరమైన బిల్లులపై ప్రత్యేక చర్చను జరిపి, ఆపై బిల్లును ఆమోదించనుంది.