: తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ, బీజేపీ... అయినా వెనకడుగు లేదంటున్న టీఆర్ఎస్


తెలంగాణలో మతపరంగా రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో, నేడు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి, బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపాలని టీఆర్ఎస్ కృత నిశ్చయంతో ఉండగా, ఈ నిర్ణయాన్ని అటు తెలుగుదేశం, ఇటు బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల ఓట్ల కోసం రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తోందని, ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్ల పెంపునకు అనుమతి లేని వేళ, ఏ విధంగా రిజర్వేషన్ల కోటాను పెంచుతారని ప్రశ్నిస్తున్న బీజేపీ, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. తాము మతపరమైన రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకమని ఆ పార్టీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు స్పష్టం చేశారు. కేసీఆర్ ఎత్తులను అడ్డుకుంటామని పిలుపునిచ్చారు.

ఇదిలావుండగా, తెలుగుదేశం సైతం టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. నేడు ఉదయం 10 గంటలకు ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ ధర్నా నిర్వహించనుంది. కేసీఆర్ తేవాలని చూస్తున్న బిల్లు అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు ఉండటంతో, వారిని అసెంబ్లీ లోపలికి రానిస్తారా? లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. ఈ ఉదయం 11 గంటలకు శాసనసభ, సాయంత్రం 4 గంటలకు శాసన మండలిలో రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సాగనున్న సంగతి తెలిసిందే. ఏ పార్టీలు వ్యతిరేకించినా, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా, ఈ బిల్లును తీసుకువచ్చి తీరుతామని టీఆర్ఎస్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.

  • Loading...

More Telugu News