: తన అభిప్రాయాన్ని తెలిపే హక్కు కీరవాణికి వుంది!: రమా రాజమౌళి
సినీ గేయ రచయితలు వేటూరి, సీతారామశాస్త్రి తరువాత అంతగా ఎవ్వరూ రాయలేకపోతున్నారని సంగీత దర్శకుడు కీరవాణి ట్వీట్ చేసిన ట్వీట్లు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై రమా రాజమౌళి స్పందించారు. తాను సోషల్ మీడియాలో లేనని అన్నారు. అయినా ఇటువంటి వ్యాఖ్యలపై న్యూస్ ఛానెల్స్, పేపర్లలో వచ్చే వార్తలు తనకు నచ్చవని అన్నారు.
అయితే, కీరవాణి ఏం ట్వీట్ చేశారో తనకు తెలుసని.. కానీ, వాటిపై వచ్చే కౌంటర్‌లపై తాను పట్టించుకోలేదని అన్నారు. కీరవాణి తన అభిప్రాయాన్ని తెలపడం ఆయన ఇష్టమని, ఆయనకు ఆ హక్కు ఉందని అన్నారు. ఇతరులు ఆయన వ్యాఖ్యలపై ఏకీభవించడం, ఏకీభవించకపోవడం అనవసరమని చెప్పారు. కీరవాణి ఆయన అభిప్రాయాన్ని తెలపడం తప్పుకాదని అన్నారు. కీరవాణి విషయంలోనే కాదని ఇటువంటి వ్యాఖ్యలపై మీడియాలో ఎన్నో వార్తలు వస్తుంటాయని చెప్పారు.
ఇక బాహుబలి సినిమా మొదలుపెట్టినప్పుడు తాము ఈ చిత్రానికి మరీ ఇంత భారీ సక్సెస్ వస్తుందని అనుకోలేదని రమా రాజమౌళి చెప్పారు. ఈ సినిమా హిట్ అవుతుందని మాత్రమే ఉండేదని అన్నారు. ఇప్పటివరకు రాజమౌళి అన్ని సినిమాలు బాగానే తీశారు కాబట్టి ఇది కూడా బాగానే తీస్తారని మాత్రం అనుకున్నామని చెప్పారు. రాజమౌళి ఎప్పుడూ పనిచేసుకుంటూనే ఉంటారని ఆమె అన్నారు.