: 11 ఏళ్లప్పుడే హెచ్‌ఐవీకి గురైంది... ఇప్పుడు బ్రిటన్‌లో మిస్ కాంగో కిరీటం దక్కించుకుంది!
ఆ యువతి 11 ఏళ్ల వయసులోనే హెచ్‌ఐవీకి గురైంది. అయినా ఆమెలో ఆత్మవిశ్వాసం సడలలేదు. హెచ్‌ఐవీ పాజిటివ్ బారిన పడిన ఆమె ఇప్పుడు బ్రిటన్‌లో మిస్ కాంగో కిరీటం దక్కించుకుని తన ఆత్మస్థైర్యం ఎంతటిదో గర్వంగా చాటుకుంది. కాంగోకి చెందిన హర్సిలీ సిందా వా బోంగో (22) అనే యువతి కథ ఇది. స్ట్రాట్‌ఫోర్డ్ టౌన్ హాల్‌లో పోటీల్లో ఆమె 2017 సంవత్సరానికిగాను ఈ కిరీటం దక్కించుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆ యువతి లండన్‌లో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో చదువుకుంటోంది.
మిస్ కాంగో కిరీటం దక్కించుకున్న హర్సిలీ సిందా వా బోంగో తన విజయంపై మాట్లాడుతూ... తన జీవితంలో తనకంటూ కనీసం ఏదో ఒకటి ఉందని చెప్పుకునేందుకు ఇప్పుడు తనకు ఆ కిరీటం వచ్చిందని, చాలా ఆనందంగా ఉందని చెప్పింది. తన కథ ఎంతో మంది హృదయాలను కదిలించిందని పేర్కొంది. తాను లండన్‌నుంచి తిరిగి కాంగోకు వెళ్లిపోయి, హెచ్‌ఐవీ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పింది. కొంతమంది యువతను కూడగట్టుకొని ఆ కార్యక్రమాల్లో పాల్గొంటానని, ప్రపంచంలో హెచ్‌ఐవీ ఉండకూడదని పేర్కొంది.