: తమిళనాడు రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకునే యత్నంలో అమిత్ షా... వచ్చే నెలలో రాష్ట్ర పర్యటన!
దక్షిణ భారతదేశంలో పాగా వేయడానికి బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు సిద్ధమైంది. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కార్యరంగంలోకి దిగారు. వచ్చే నెల 10వ తేదీన ఆయన చెన్నైకు వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 15 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గణనీయమైన ఓట్లను సాధించడం అమిత్ షా లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఎక్కువ ఓట్లు సాధించిన 15 స్థానాలను ఎంపిక చేసి, అక్కడ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను షా నియమించనున్నట్టు సమాచారం. అంతేకాకుండా, నియోజకవర్గం కమిటీలను కూడా ఆయన ఏర్పాటు చేయబోతున్నారు. మూడు రోజుల పాటు తమిళనాడులో మకాం వేయనున్న అమిత్ షా... పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.