: ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్‌పై గడిపితే ఒత్తిడి, సామాజిక ఆందోళన, సిగ్గు, ఆత్మన్యూనతా భావాలకు గురి!
నేటికాలంలో స్మార్ట్‌ఫోన్‌కు బానిసలైపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే, అధికంగా సెల్‌ఫోన్‌ను ఉపయోగిస్తే వ్యక్తిగతంగానే కాకుండా ఉద్యోగ నిర్వహణలో, సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులు వస్తున్నాయి. 182 మంది కళాశాల విద్యార్థుల నుంచి రోజువారీ స్మార్ట్‌ఫోన్ వాడకంపై నివేదిక తీసుకున్న ఓ పరిశోధక బృందం వాటిని పరిశీలించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్‌కు బానిసలైనవారు సామాజిక మాధ్యమాలను అధికంగా ఉపయోగించడం, ఎల్లప్పుడు స్నేహితులతో చాటింగ్ చేస్తుండడం, ఆన్లైన్ షాపింగ్, వీడియో గేమ్స్, అశ్లీల చిత్రాలను చూడటం వంటి వాటికి గంట కొద్దీ సమయాన్ని వినియోగిస్తున్నారని తేలింది.
అటువంటి వారు ఒత్తిడికి, సామాజిక ఆందోళనకు గురవుతున్నారని, సిగ్గు, ఆత్మన్యూనతా భావాలకు లోనవుతున్నారని పరిశోధనలో తెలిసింది. ఫోన్ వాడే వారిని పలు వర్గాలుగా పరిశోధన బృందం విభజించింది. స్మార్ట్ఫోనుపై మోజు కలిగిన వారు, బానిసైపోయినవారుగా వర్గీకరించి ఇందులో 7 శాతం మంది ఫోనుకు బానిసైపోయినవారు ఉన్నారని తెలిపింది. ఇక 12 శాతం మంది మోజులో ఉన్నవారని తెలిపింది. వారి వ్యక్తిగత జీవితంలో పాటు అటు సమాజంలో, ఇటు కార్యాలయాల్లో వారు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తేల్చింది. వారిలో అధికశాతం మంది మహిళలే ఉండడం గమనార్హం. ఇటువంటి అలవాట్ల బారిన పడితే ఫోన్ రింగ్ అయినా కాకపోయినా తరుచూ దాన్ని చూసుకుంటుంటారని, ఫోన్ దగ్గరలేకపోతే ఏదో కోల్పోయినట్లు భావించే వారు నిపుణులను కలవడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను స్మార్ట్‌గా ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.