: ఒట్టిమాటలు చెబితే బంగారు తెలంగాణ రాదు: సీఎం కేసీఆర్
ఒట్టిమాటలు చెబితే బంగారు తెలంగాణ రాదని సీఎం కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ కోసం అందరూ కృషి చేస్తేనే, అందుకోసం శ్రమపడితేనే సాధ్యమవుతుందని చెప్పారు. ఆ దిశగానే ప్రభుత్వ నేతలు అడుగులు వేస్తున్నారని అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆయన రైతులతో సమావేశమై ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వాల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం నుంచి 24 లక్షల టన్నుల ఎరువులను పూర్తిగా ఉచితంగా రైతులకు అందిస్తామని ప్రకటన చేశారు. ఆనాడు తాను బంగారు తెలంగాణ కోసమే దీక్ష చేసి నిమ్స్ ఆసుపత్రిలో పడ్డానని అన్నారు.
రైతులంతా తాము ఆనందంగా ఉన్నామని చెప్పేవరకు తాము వారికి ఇకపై ఉచిత సేవలు అందిస్తామని కేసీఆర్ చెప్పారు. సమైక్య పాలనలో నిజామాబాద్ నాశనమైందని, తాను బతికి ఉండగానే ఆ ప్రాంతానికి నీళ్లు తెచ్చి తీరతానని అన్నారు. రాష్ట్రంలో ఒక్క క్షణం కూడా కరెంటు కోత లేకుండా చేస్తానని అన్నారు. రుణమాఫీలో తాము కొత్త చరిత్ర సృష్టించామని అన్నారు. రాష్ట్రంలో కొత్త శకానికి నాంది పలకబోతున్నామని అన్నారు. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పారు. కోటి ఎకరాలకు నీరు తెచ్చి రైతుల కళ్లలోకి ఆనందాన్ని తీసుకొస్తానని చెప్పారు.