: సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోలు పోస్ట్ చేసిన ప్రేమికుడు.. విద్యార్థిని ఆత్మహత్య


తన చావుకు తన ప్రేమికుడే కారణమని పేర్కొంటూ ఆత్మ‌హ‌త్య లేఖ రాసి ఓ యువ‌తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఘ‌ట‌న ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఓ‍పెన్‌ లెర్నింగ్‌లో బీకాం చదువుతున్న 21 ఏళ్ల ఆ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఆ అమ్మాయి చదువుకోడానికి ఢిల్లీ వచ్చి తోటి విద్యార్థి అయిన ప్రకాష్‌తో ప్రేమలో ప‌డింద‌ని పోలీసులు చెప్పారు. వారిద్దరూ మూడేళ్ల పాటు సహజీవనం చేసినట్లు, అయితే వారి పెళ్లికి వారి కుటుంబాలు అంగీకరించనట్టు పేర్కొన్నారు.

తల్లిదండ్రులను వదిలేసి తనతో పాటు బీహార్‌ వచ్చేయమని ఆ యువ‌తిని ప్రకాష్‌ అడిగేవాడని చెప్పారు. అయితే అందుకు ఆ యువ‌తి నిరాకరించడంతో త‌న మాట కాద‌న్నందుకు వ్యక్తిగత వీడియోలు బయట పెడతానని బెదిరించేవాడని పేర్కొన్నారు.
సూసైడ్‌నోట్ ను ప‌రిశీలించిన పోలీసులు.. త‌న‌తో కలిసున్నప్పుడు తీసిన‌ వ్యక్తిగత వీడియోలను తన ప్రేమికుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని గుర్తించారు. ఆ యువతి కుటుంబం మధ్యప్రదేశ్‌లో ఉంటుందని చెప్పారు.

ఆ యువ‌కుడు బీహార్‌ వెళ్లిపోయాడని, ఆ త‌రువాత ఆ యువ‌తి ఫోన్లు చేసిన‌ప్ప‌టికీ స‌మాధానం ఇవ్వ‌లేద‌ని చెప్పారు. దీంతో ఆ యువ‌తి ఈ నెల  8వ తేదీన తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు కూడా చేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై విచారణ జరుగుతుండగానే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని అన్నారు.

  • Loading...

More Telugu News