: హ్యాపీడేస్, శతమానంభవతి ఫ్లాప్ అవుతాయని చెప్పాను!: మిక్కీ జే మేయర్
సినిమాల జయాపజయాలపై తాను వేసిన అంచనాలు పూర్తిగా విఫలం అయ్యాయని, ఇకపై ఓ చిత్రం హిట్ అవుతుందా? లేదా? అన్న విషయాన్ని గురించి మాట్లాడబోనని సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ వ్యాఖ్యానించాడు. నిన్న మొన్నటి వరకూ రీ రికార్డింగ్ చేస్తూ, సినిమాపై ఓ అంచనాకు వచ్చి దర్శక, నిర్మాతలకు తన అభిప్రాయాన్ని చెప్పేవాడినని, తన అంచనాలు పలుమార్లు తల్లకిందులయ్యాయని ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిక్కీ చెప్పాడు.
హ్యాపీడేస్ చిత్రం మొదట్లో తనకు అర్థం కాలేదని, ప్రేక్షకులకు నచ్చదని భావించానని, కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయిందని చెప్పాడు. ఇటీవల వచ్చిన శతమానం భవతి చిత్రం ఫ్లాప్ అవుతుందని రీరికార్డింగ్ తరువాత దిల్ రాజుకు ఫోన్ చేసి చెప్పానని గుర్తు చేసుకున్నాడు. ఆపై దిల్ రాజు, 'ఇది హిట్ సినిమా మిక్కీ, అలా చెబుతున్నావేంటి?' అని అడిగారని, చివరికి ఆయన మాటలే నిజమయ్యాయని చెప్పాడు. అందువల్ల ఇకపై ఫలితాలపై మాట్లాడబోనని, తన పాటలను ఎవరైనా పాడుకోవచ్చని అన్నాడు.