: ఈ నెల 30 లోపు బ్యాంకుల్లో ఆధార్ వివరాలు ఇవ్వాలి.. లేదంటే ఆ ఖాతాలు బ్లాక్ అవుతాయి: ఐటీ శాఖ
ఆదాయ పన్ను శాఖ అధికారులు 1 జులై 2014 నుంచి 31 ఆగస్ట్ 2015 మధ్య బ్యాంకు ఖాతాలు తెరిచిన వారికి కొత్తగా పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ తేదీల మధ్య బ్యాంకు అకౌంట్లు తెరిచిన వారు ఈ నెల 30లోపు తప్పనిసరిగా ఆధార్‌కార్డు వివరాలను సమర్పించాలని సూచించారు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లయెన్స్ యాక్ట్ (ఎఫ్ఏటీసీఏ) కింద ఆధార్ వివరాలు అనుసంధానం చేసుకోకపోతే ఆ అకౌంట్లను బ్లాక్ చేస్తామని తేల్చి చెప్పారు. ఎఫ్ఏటీసీఏ ప్రకారం భారత్, అమెరికా మధ్య ఆర్థిక సమాచారం ఆటోమేటిగ్గా చేతులు మారుతుందని తెలిపిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్.. ఆగస్ట్ 31, 2015 నుంచి అమెరికాతో భారత్ ఈ ఒప్పందం కుదుర్చుకుందని వివరించింది.
దీంతో మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థలు కూడా తమ కస్టమర్లు కొత్త నిబంధనల ప్రకారం తమ వివరాలు ఇవ్వాలని సూచిస్తున్నాయని, అందుకే ఆ తేదీల్లో అకౌంట్లు ఓపెన్ చేసిన వారు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని పేర్కొంది. విదేశాల్లో వచ్చిన ఆదాయానికి కూడా చట్టబద్ధంగా పన్ను చెల్లించేలా చేసే ఉద్దేశంతో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చుకుంది.