: బ్యాడ్మింటన్ సమాఖ్య ఎన్నికల్లో పీవీ సింధు?


భారత స్టార్‌ షట్లర్‌, వరల్డ్ నెంబర్ 2 క్రీడాకారిణి పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్యలో ఎన్నికల కోసం మార్చి 27న నామినేషన్ల దరఖాస్తు గడువు ముగిసింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయనున్నవారిపై క్లారిటీ వచ్చింది. ఈ ఎన్నికల బరిలో ఆరుగురు పురుష ఆటగాళ్లు, ముగ్గురు మహిళా క్రీడాకారిణులు నిలిచారు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ సింధుతో పాటు పురుషుల డబుల్స్‌లో ఇద్దరు మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాళ్లు ఉన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అథ్లెట్స్ కమిషన్ లో భాగమైన యుహాన్‌ టాన్‌ (బెల్జియం), క్రిస్టియాన్‌ విట్టింగస్‌ (డెన్మార్క్‌), గ్రేసియా పోలి (ఇండోనేసియా) ల పదవీ కాలం వచ్చేనెలతో ముగియనుంది. అలాగే గతేడాది రాజీనామా చేసిన టాంగ్‌ యువాంటింగ్‌ స్ధానం కూడా భర్తీ చేయనున్నారు.
 
నిబంధనల ప్రకారం ఒక పురుష, ఒక మహిళా ప్లేయర్ ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నాలుగు స్థానాల్లో రెండు మహిళలకు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఇందులో స్థానం సంపాదించగా, పురుషుల మధ్య గట్టిపోటీ నెలకొంటుంది. పోటీ చేయనున్న ఆరుగురిలో ఇద్దరు పురుషులు మాత్రమే ఎంపిక అవుతారు. భారత్ నుంచి అంతగా పేరులేని డబుల్స్‌ ఆటగాడు నిఖర్‌ గార్గ్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేశాడు. ముంబైకి చెందిన ఈ ఆటగాడు గతేడాది మేలో అంతర్జాతీయ టోర్నమెంట్‌ లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ సంఘాల ద్వారా కాకుండా నేరుగా రిజిష్టర్‌ చేసుకునే సౌకర్యాన్ని బీడబ్ల్యూఎఫ్‌ కల్పించాలని ఆన్‌ లైన్‌ పిటిషన్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింధు పోటీ చేస్తే ఎన్నికవడం అంత కష్టం కాదని చెప్పచ్చు! 

  • Loading...

More Telugu News