: మీ దేశంలో పెద్దలతో పిల్లలు ఇలాగే మాట్లాడుతారా?: పాక్ యువతిపై ట్విట్టర్ లో రిషికపూర్ ఆగ్రహం
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు రిషికపూర్ పాకిస్థాన్ యువతిపై మండిపడ్డారు. పాకిస్థాన్ ఉరి శిక్ష విధించిన కుల్ భూషణ్ జాదవ్ ఘటనపై ఆయన...'సారీ ఇండియా.. మనం నటులు, సినిమాలు, క్రీడలతో భారత్- పాకిస్థాన్ మధ్య సామరస్యపూర్వక వాతావరణం నెలకొనాలని కోరుకుంటాం...కానీ పాకిస్థాన్ కి ద్వేషమే కావాలి...మనమేం చేయలేం...రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై పాకిస్థాన్ కు చెందిన ఫరీహా అనే యువతి 'ఈ మనిషి ఎంతటి నీచమైన అమాయకుడు!' అంటూ నోటికొచ్చినట్టు తిట్టిపోసింది. దీంతో రిషికపూర్... ‘నోరు అదుపులో పెట్టుకో అమ్మాయ్. పెద్దలతో ఇలాగే మాట్లాడాలని నీ తల్లిదండ్రులు నేర్పారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి సమాధానమిచ్చిన ఫరీహా ‘నా తల్లిదండ్రులు నాకు మంచే నేర్పారు సర్. కానీ మీరు నీతి వాఖ్యలపై ఇచ్చే ఉపన్యాసం మీ అమాయకత్వాన్ని కప్పిపుచ్చదు. స్పైయింగ్ కి పాల్పడేవారిని వేరే దేశాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోండి’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. దీనికి స్పందించిన రిషీ కపూర్ ‘నేను మాట్లాడేది నీ భాష గురించి.. న్యాయం గురించి కాదు. బహుశా మీ దేశంలో పెద్దలతో ఇలాగే మాట్లాడతారేమో!’ అంటూ ఆయన మండిపడ్డారు. దీంతో ఆ యువతి తాను చేసిన ట్వీట్లను కొద్ది సేపటి తరువాత డిలీట్ చేసిందని, తనను బ్లాక్ చేసిందని రిషీ కపూర్ తెలిపారు.