: సినీ పరిశ్రమను తప్పుపట్టడం సరికాదు: కంగన వ్యాఖ్యలపై మహేశ్‌భట్
సినీ పరిశ్రమలో స్టార్‌కిడ్స్‌కే మంచి అవకాశాలు లభిస్తున్నాయని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలపై బాలీవుడ్ దర్శక నిర్మాత మహేశ్‌భట్ స్పందిస్తూ.. కంగనా చేసిన వ్యాఖ్యల్లో కొంత నిజం ఉందని అన్నారు. ఈ పరిస్థితి మనదేశ సినీపరిశ్రమేలోనే కాదని, హాలీవుడ్లో సైతం 'సినీ పరిశ్రమ ఓ దీవి లాంటిది' అని అన్నారు. బయటి వ్యక్తులకు ఇది పెద్ద కోటలా కనిపిస్తుందని, ఇందులోకి ప్రవేశించడం అంత సులువు కాదని అనుకుంటారని అన్నారు.
కంగనా అన్నదాంట్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ప్రతిసారి ఇండస్ట్రీని అలాగే చూడటం సరికాదని మహేశ్‌భట్ వ్యాఖ్యానించారు. తన కెరీర్లో చాలామందికి అవకాశాలు ఇచ్చానని చెప్పారు. అనుపమ్ఖేర్కి మొదట్లో తానే అవకాశం ఇచ్చానని అన్నారు. కంగనా ఓ అద్భుతమైన నటి అని, అందుకు ఆమె గర్వపడాలని ఆయన అన్నారు. అంతే కానీ సినీ పరిశ్రమను తప్పుపట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాల్లో అవకాశాలు ఇవ్వడమే తనలాంటి వారి వద్ద ఉంటుందని, ఏ సినిమా విజయం సాధిస్తుందో, ఎవరు స్టార్ అవుతారనేది నిర్ణయించడం మాత్రం తమ చేతుల్లో ఉండబోదని అన్నారు.