: కేసీఆర్ మనవడికి కూడా ఓ పదవి ఇచ్చి, ఇలాంటి పనులు చేయించుకోండి: హైకోర్టు జేఏసీ అధ్యక్షుడు ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందని హైకోర్టు జేఏసీ అధ్యక్షుడు రావుల చెన్నారెడ్డి విమర్శించారు. చివరకు కేటీఆర్ కుమారుడితో భద్రాచలం రాముడి కల్యాణోత్సవానికి పట్టు వస్త్రాలను పంపించారని మండిపడ్డారు. అంత అవసరం అనుకుంటే, కేటీఆర్ కుమారుడికి కూడా ఓ పదవి ఇచ్చి, ఇలాంటి పనులు చేయించుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లయినా, ఏ ఒక్క మంత్రికి కూడా పూర్తి స్థాయి బాధ్యతలను అప్పజెప్పలేదని మండిపడ్డారు. బాధ్యతలు లేనప్పుడు, వీరందరికీ మంత్రి పదవులు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కష్టంతో ఏర్పడిన తెలంగాణలో... సరైన నిర్ణయాలు తీసుకుని, అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి మాదిరే ఒంటెద్దు పోకడలతో ముందుకు సాగితే... రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.