: బీజేపీతో చెలిమికి జగన్ తహతహ.. రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం!


బీజేపీతో చెలిమికి జగన్ తహతహలాడుతున్నారా? తనను ఆదుకునేది ప్రధాని ఒక్కరేనని భావిస్తున్నారా? రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పంచన చేరక తప్పదని జగన్ బలంగా విశ్వసిస్తున్నారా?.. ఈ అన్ని ప్రశ్నలకు అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీతో చెలిమి కోసం ఢిల్లీలో జగన్ పలు రకాలుగా ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడంతో ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ‘సేవ్ డెమొక్రసీ’ పేరుతో ప్రజల్లోకి వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇది వైసీపీని తీవ్ర నిరాశకు గురిచేసింది.

మరోవైపు  అక్రమాస్తుల కేసులో సీబీఐ జోరు పెంచింది. దీంతో ప్రస్తుత తరుణంలో తనను ఆదుకునేది బీజేపీ తప్ప మరోటి కాదని భావించిన జగన్ ఆ పార్టీతో జట్టు కట్టడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి పవన్ కల్యాణ్ క్రమంగా దూరం కావడంతో ఇదే మంచి అవకాశంగా భావించిన జగన్ దీనిని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో తనకు మేలు జరుగుతుందని, అక్రమాస్తుల కేసుల విచారణలో వేగం నెమ్మదిస్తుందని జగన్ ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. బీజేపీకి స్నేహహస్తం చాచేందుకే జగన్ ప్రధాని అపాయింట్‌మెంట్ కోరినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బంగ్లాదేశ్ ప్రధాని పర్యటన నేపథ్యంలో జగన్‌కు మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. అయితే వారం రోజుల తర్వాత మాత్రం ప్రధాని అపాయింట్‌మెంట్ దొరుకుతుందని జగన్ ఆశగా ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News